పాక్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరిక – భారత్ ఖండన

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ అమెరికా పర్యటనలో భారత్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా పేరుగాంచిన ఈ రిఫైనరీపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా, భారత్‌కు అణు బెదిరింపులు కూడా జారీ చేశారు.

ఫ్లోరిడాలో జరిగిన ఒక విందు కార్యక్రమంలో, మునీర్ ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిత్రంతో పాటు ఖురాన్ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్‌ను చూపించారు. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, ఇవి పాకిస్థాన్ యుద్ధోన్మాద వైఖరికి నిదర్శనమని పేర్కొంది. మునీర్ అణు హెచ్చరికలతో భారత్–పాకిస్థాన్ సైనిక, అణు సామర్థ్యాలపై చర్చ మళ్లీ చెలరేగింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ గణాంకాల ప్రకారం, భారత్ సైనిక బలం పాకిస్థాన్ కంటే స్పష్టంగా అధికం. భారత్‌లో 14 లక్షల మంది సక్రియ సైనికులు ఉండగా, పాకిస్థాన్‌లో ఈ సంఖ్య 7 లక్షల లోపే ఉంది. భారత్‌లో 25 లక్షల పారామిలటరీ బలగాలు ఉండగా, పాకిస్థాన్‌లో కేవలం 5 లక్షలే ఉన్నాయి.

న్యూక్లియర్ సామర్థ్యంలో కూడా భారత్ ముందంజలో ఉంది. భారత్ వద్ద 180 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉండగా, పాకిస్థాన్ వద్ద 170 మాత్రమే ఉన్నాయని అంచనా. భారత్‌ అగ్ని–5 క్షిపణులు 5,000 నుంచి 8,000 కి.మీ. వరకు లక్ష్యాలను చేధించగలవు. అంతేకాక, బహుళ లక్ష్యాలను ఒకేసారి దాడి చేసే ఎంఐఆర్‌వీ సాంకేతికతను కలిగి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, పాకిస్థాన్ షాహీన్–3 క్షిపణి రేంజ్ 2,750 కి.మీ. వరకు మాత్రమే పరిమితం.

Read More : అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు .