కేరళ రాజకీయాల్లో మరోసారి పెద్ద దుమారం రేగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశంసించిన విషయంలో రాష్ట్రంలో అధికార సీపీఎం, క్యాథలిక్ చర్చి మధ్య మాటల యుద్ధం ముదిరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు, చర్చి వర్గాల తీవ్ర ప్రతిస్పందనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అసలు ఘటన ఇలా ఉంది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు క్రిస్టియన్ నన్‌లను తప్పుడు ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని వారి విడుదలకు సహకరించారు. దీనిపై తలస్సరీ ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పంప్లానీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో బీజేపీపై విమర్శలు చేసి, విడుదల తర్వాత అమిత్ షాను పొగడటం ఆర్చ్‌బిషప్ అవకాశవాదానికి ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
గోవిందన్ వ్యాఖ్యలపై చర్చి వర్గాలు ఘాటుగా స్పందించాయి. కేరళ క్యాథలిక్ కాంగ్రెస్ ప్రతినిధి ఫాదర్ ఫిలిప్ కవియిల్, ఇవి ఆయన హోదాకు తగని మాటలు అని, పినరయి విజయన్ ప్రభుత్వం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తలస్సరీ ఆర్చిడయాసిస్ కూడా గట్టిగా ప్రశ్నించింది—”బిషప్‌లు సీపీఎం పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండాలా?” అని. కేంద్రం చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం తమ బాధ్యత అని స్పష్టం చేసింది. ‘అవకాశవాది’ అన్న పదం గోవిందన్‌కే సరిపోతుందని, ఆయన వ్యక్తిగత బలహీనతలను ఇతరులపై మోపవద్దని చురకలంటించింది.
ఈ వివాదం సీపీఎంకే కాకుండా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కూడా రాజకీయ ఇబ్బందులు కలిగించే అవకాశముంది.
Read More : తమిళనాడులో ఇంటింటికీ రేషన్ సరుకులు
