14 భారతీయులను రక్షించిన నౌకాదళం

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అగ్నిప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్‌కు భారత నౌకాదళం సకాలంలో అండగా నిలిచి 14 మంది భారతీయులను రక్షించింది. ‘ఎంటీ యీ చెంగ్ 6’ పేరుతో ప‌లావు దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్‌ భారత్‌లోని కాండ్లా పోర్టు నుంచి ఒమన్‌లోని షినాస్‌ వైపు ప్రయాణిస్తున్న సమయంలో, ఇంజిన్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో నౌక సముద్ర మధ్యలో నిలిచిపోయింది.

ఈ క్రమంలో ట్యాంకర్‌లో ఉన్న సిబ్బంది సహాయం కోసం అత్యవసర సందేశాలు పంపారు. అదే సమయంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ తబార్ నౌకకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన తబార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారత నౌకాదళం అధికారికంగా స్పందిస్తూ, “గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మిషన్‌లో ఉన్న ఐఎన్ఎస్ తబార్, ట్యాంకర్ నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సందేశానికి సత్వర స్పందించి సహాయ చర్యలు చేపట్టింది. నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారందరినీ క్షేమంగా రక్షించగలిగాం” అని వెల్లడించింది.

Read More : ఇండోర్ హనీమూన్ హత్య కేసులో కీలక మలుపు