పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై హరీశ్ రావు ఘాటుగా స్పందన

Harish Rao

గ్రానైట్ వ్యాపారిపై బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్న సుబేదారి పోలీసులు, అనంతరం వరంగల్‌కి తరలించారు. ఈ అరెస్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు, ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డిపై చట్టబద్ధత లేని కేసులు బనాయించి, శని, ఆదివారాల్లో అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘కేడీలు-బేడీలు’ రాజ్యం నడుస్తోందని ఆరోపిస్తూ, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. “ఫార్ములా వన్ రేసును ఆపడానికి KTR చేసిన ప్రయత్నాలు, రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులు-ఇవన్నీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి” అని హరీష్ మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం సీఎం పదవి విలువను తగ్గించేస్తోందని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై దాడులకు పరిమితమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Read More : కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర విమర్శలు