భారత్-ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అధికారుల నిర్లక్ష్యంతో వివాదాస్పదమైంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో నాలుగో రోజు చివర్లో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అయితే వర్షం ఆగిన తర్వాత కూడా అధికారులు, గ్రౌండ్ సిబ్బంది ఆటను తిరిగి ప్రారంభించడంలో చూపిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు గెలుపు కోసం కేవలం 35 పరుగులు, భారత్‌కు నాలుగు వికెట్లు అవసరం ఉన్న కీలక దశలో ఈ ఆట నిలిపివేయబడింది. వర్షం పూర్తిగా ఆగిపోయి వాతావరణం అనుకూలంగా మారినా మైదానాన్ని సిద్ధం చేయడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై స్కై స్పోర్ట్స్ కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఘాటుగా స్పందించారు. “మైదానంలో ఉన్న ప్రతిఒక్కరూ టికెట్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారు. వర్షం ఆగింది. వెంటనే ప్రక్రియను మొదలు పెట్టండి. సూపర్-సాపర్‌ను మైదానంలోకి తీసుకురండి” అంటూ ఆయన అధికారులపై విమర్శలు గుప్పించారు. అద్భుతంగా సాగుతున్న మ్యాచ్‌ను వారి నిర్లక్ష్యం రసాభాసగా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంతటి కీలకమైన మ్యాచ్‌లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నిబంధనల పేరుతో మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వర్షం ఆగిన తర్వాత ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేనప్పుడు, కామన్ సెన్స్ ఉపయోగించి ఆటను కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు.
Read More : వాంఖడేలో సునీల్ గవాస్కర్ విగ్రహం ఏర్పాటు

One thought on “ఓవల్ టెస్ట్‌లో అధికారుల నిర్లక్ష్యం”
Comments are closed.