హనీమూన్ మర్డర్ కేసులో మరో మలుపు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఉన్న ఆరోపణలను సోనమ్ తిప్పికొడుతూ, తాను అమాయకురాలినని, హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.

ఇక జూన్ 2న మేఘాలయలో ఓ లోయలో రాజా మృతదేహం లభ్యమైన తర్వాత, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోనమ్ తల్లిదండ్రులు కూడా వారి బంధువులతో కలిసి అంత్యక్రియలకు హాజరయ్యారు. మృతదేహం ఇంటికి తీసుకొచ్చిన సమయంలో, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ఆమె తండ్రిని ఓదార్చుతున్న దృశ్యాలు రాజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో దర్శనమివ్వడం బాధిత కుటుంబాన్ని ఒక్కసారిగా కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే, మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. జూన్ 2న రాజా మృతదేహం కనిపించగా, సోనమ్ ఆచూకీ లభించలేదు. అనంతరం జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోనమ్ పోలీసులకు లొంగిపోయింది.

మేఘాలయ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం – రాజా హత్యకు ముందే సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా కలిసి కుట్ర పన్నారు. హత్య కోసం వికాష్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కిరాయి హంతకులను ఏర్పాటు చేసి, మేఘాలయకు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ హంతకులను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Read More : హనీమూన్ హత్య కేసులో సోనమ్ గువాహటికి తరలింపు.

One thought on “హనీమూన్ మర్డర్ కేసులో మరో మలుపు

Comments are closed.