పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన దారుణమైన దాడిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దాడిలో తల్లుల కుంకుమ తుడిచివేసిన ఉగ్రవాదులకు భారతదేశం “ఆపరేషన్ సిందూర్” రూపంలో గట్టి బుద్ధి చెప్పిందన్నారు. మతం పేరుతో పాకిస్థాన్ విభజన రాజకీయాలు కొనసాగిస్తుంటే, భారతీయులు ఐక్యంగా నిలబడి ఆ కుట్రలను తిప్పికొట్టారని గుర్తు చేశారు. అవసరమైతే పాక్ వైమానిక స్థావరాలపై దాడులు కూడా జరిపినట్లు తెలిపారు.
సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన నేరుగా పర్యటించలేకపోయారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. సిక్కింను ప్రపంచ పర్యాటక రంగంలో ముఖ్య గమ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. “సిక్కింను గ్రీన్ మోడల్ స్టేట్‌గా అభివృద్ధి చేద్దాం” అని ప్రధాని పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ లక్ష్యం – నాలుగు మూలస్తంభాలు
వికసిత్ భారత్ నిర్మాణం పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు ప్రధాన మూలస్తంభాలపై ఆధారపడిందని మోదీ వివరించారు. సిక్కిం రైతులు వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిక్కిం ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Read More : వివాహిత ప్రేమికుడితో పారిపోవడానికి అమాయకుడి హత్య.

One thought on “ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు”
Comments are closed.