న్యూ జల్పాయ్‌గురిలో మానవ అక్రమ రవాణా భగ్నం

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ ట్రాఫికింగ్ కుట్రను భగ్నం చేస్తూ అధికారులు 56 మంది అమాయక మహిళలను సురక్షితంగా రక్షించారు. బెంగళూరులో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి న్యూ జల్పాయ్‌గురి–పాట్నా క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), టికెట్ ఎగ్జామినింగ్ సిబ్బందికి ఈ విషయం తెలిసింది. 18 నుంచి 31 ఏళ్ల వయసు గల ఈ మహిళలు జల్పాయ్‌గురి, కూచ్ బెహార్, అలిపుర్‌ద్వార్ జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు. మహిళల వద్ద టికెట్లు లేకపోవడం, వారి చేతులపై కోచ్, బెర్త్ నంబర్లు ముద్రించి ఉండటం అనుమానాలకు దారితీసింది. ప్రశ్నించగా వారిని తీసుకెళ్తున్న ఒక పురుషుడు, ఒక మహిళ సమాధానాలు తారుమారు చెప్పడంతో పరిస్థితి బయటపడింది. బెంగళూరులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, బీహార్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారో వివరించలేకపోవడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

దర్యాప్తు ముమ్మరం
బాధితులు బెంగళూరులో ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలతో తమను తీసుకెళ్లారని ఆర్పీఎఫ్‌కు తెలిపారు. దీంతో మానవ అక్రమ రవాణా కోణంలో కేసును రైల్వే పోలీసులు (జీఆర్పీ), ఆర్పీఎఫ్ కలిసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్రాఫికింగ్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్‌ను బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

బలహీన వర్గాలే లక్ష్యం
రక్షించిన మహిళలను సురక్షితంగా వారి కుటుంబాలకు అప్పగించారు. అభివృద్ధి చెందని ప్రాంతాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలను ఉద్యోగ వాగ్దానాలతో మోసం చేసి ట్రాఫికింగ్ చేసే ముఠాలు పెరుగుతున్నాయి అన్న ఆందోళనలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : రోదసిలో 18 రోజులు గడిపిన శుభాంశు శుక్లా… మళ్లీ నడక అభ్యాసం

One thought on “న్యూ జల్పాయ్‌గురిలో మానవ అక్రమ రవాణా భగ్నం

Comments are closed.