నేతాజీ అస్థికలు స్వదేశానికి తేవాలని అనితా బోస్ విజ్ఞప్తి.

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న తరుణంలో ఆమె చేసిన ఈ అభ్యర్థన ప్రాధాన్యం సంతరించుకుంది.

82 ఏళ్ల వయస్సులో జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్, జాతీయ మీడియాతో మాట్లాడుతూ “నా వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు త్వరితగతిన ముగింపు కావాలి. నాకు ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం వస్తే, తప్పకుండా నా తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని కోరుతాను” అని అన్నారు.

ఆమె మరింతగా మాట్లాడుతూ – “గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ విషయంపై ముందడుగు వేసింది. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొనసాగించాలి. ఈ సమస్యను ఇక ఆలస్యం చేయకూడదు. నా కొడుక్కి ఈ బాధ్యత వారసత్వంగా మిగలాలని నేను కోరుకోవడం లేదు” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

“ఇది కేవలం నా వ్యక్తిగత విషయం కాదు. నా తండ్రి యావత్ దేశానికి చెందిన నాయకుడు” అని అనితా బోస్ స్పష్టం చేశారు.

1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ కమిటీలు తేల్చాయి. ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని నివేదికలు వెల్లడించాయి. ఆయన అస్థికలు ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో రెంకోజీ బౌద్ధ ఆలయంలోని కలశంలో భద్రంగా ఉన్నాయని బలమైన నమ్మకం ఉంది.

Read More : జపాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం

One thought on “నేతాజీ అస్థికలు స్వదేశానికి తేవాలని అనితా బోస్ విజ్ఞప్తి.

Comments are closed.