కేరళ సముద్ర తీరాన్ని సెంటరుగా చేసుకుని సోమవారం ఉదయం ఒక్కసారిగా ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగపూర్ జెండా ఉన్న కంటైనర్ షిప్ MV వాన్ హై 503 లో ఊహించని భారీ పేలుడు సంభవించింది. ఓడలోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించింది.
రక్షణ శాఖ ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం… సోమవారం ఉదయం సుమారు 10:30 ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌక లోపల భాగంలో పేలుడు సంభవించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ ను తక్షణమే సంఘటనా ప్రదేశానికి తరలించగా, కొచ్చిన్ నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ్ నుంచి డోర్నియర్ నిఘా విమానం గగనతల పర్యవేక్షణ చేపట్టింది. నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ ఎంవీ వాన్ హై 503 నౌక 270 మీటర్ల పొడవు కలిగిన భారీ కంటైనర్ వాహక నౌక. ఇది జూన్ 7న శ్రీలంకలోని కొలంబో పోర్టు నుంచి బయలుదేరి, జూన్ 10న ముంబై చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యంలో కేరళ తీరానికి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవలే కేరళ తీరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. లైబీరియా జెండా కలిగిన ఎంఎస్సీ ఎల్సా-3 నౌక సముద్రంలో ఒరిగిపోవడంతో, అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఆ సమయంలో భారత తీర రక్షణ బలగాలు స్పందించి అందులో ఉన్న 24 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఆ నౌకలో చమురు, ఫర్నేస్ ఆయిల్, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది.
Read More : ‘హనీమూన్ మర్డర్’ కేసులో మరో కీలక మలుపు

One thought on “కేరళ తీరంలో భారీ నౌకలో పేలుడు కలకలం…”
Comments are closed.