ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల భద్రత, గౌరవం కోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, రాష్ట్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రవాస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వేగవంతమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని లోకేశ్ కోరారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగిన చర్చల వివరాలు కూడా జైశంకర్‌కు వివరించారు.
ప్రస్తుతం సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని, అందులో అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, యూరప్‌లో 4 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అమెరికాలో ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం స్థానిక ప్రజల కంటే రెట్టింపు స్థాయిలో ఉందని గర్వంగా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాలతో మొబిలిటీ, మైగ్రేషన్ భాగస్వామ్యాల ఏర్పాటులో కేంద్ర చర్యలు అభినందనీయమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్‌షిప్స్ కోసం ఏపీ చురుకుగా పనిచేస్తోందని, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో జాయింట్ ట్రైనింగ్, అసెస్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నామన్నారు. త్వరలో నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించి ఉద్యోగార్థులు, పారిశ్రామిక సంస్థలను అనుసంధానించే వేదికగా నిలిపే ప్రణాళిక ఉందని వివరించారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం రప్పించడంలో కేంద్రం నుంచి డేటా షేరింగ్ సహకారం అవసరమని, ఈ విషయంలో పూర్తి మద్దతు ఇవ్వాలని జైశంకర్‌ను మంత్రి లోకేశ్ కోరారు.
Read More : విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం
