ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా తీర్చిదిద్దే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC) కీలకంగా మారనున్నాయి. ఈ దిశగా, అంతర్జాతీయ ఖ్యాతిగల ఏఎన్ఎస్ఆర్ (ANSR) సంస్థ విశాఖపట్నంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో 10,000 మందికి పైగా నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మంగళవారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందం పై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏఎన్ఎస్ఆర్ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ, “విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక వసతులు, దార్శనిక నాయకత్వం మిళితమై ఉన్నాయి. మా క్యాంపస్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల దృష్టిని ఆకర్షిస్తుందన్న నమ్మకముంది” అని తెలిపారు.
“విశాఖను జీసీసీ రాజధానిగా తీర్చిదిద్దుతాం” – మంత్రి లోకేశ్
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. “రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. ఐటీ, జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలే ఉండేలా ప్రణాళికలు రూపొందించాం. ఈ ఉద్యమానికి విశాఖనే కేంద్రంగా ఎంపిక చేశాం” అని తెలిపారు. “ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు ఒక్క ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించాం. దీని ద్వారా ఉద్యోగాల లక్ష్యంలో 12 శాతం సాధించాం. త్వరలో దేశంలోని టాప్ 100 ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించడమే మా తదుపరి ధ్యేయం” అని లోకేశ్ వెల్లడించారు.
అమెరికా వెలుపల గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తుండటం, దేశంలోనే అతిపెద్ద డేటా సిటీగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిన తర్వాత విశాఖకు అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని చెప్పారు. జీసీసీల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చి, క్లౌడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో విద్యార్థులకు నైపుణ్యాలు అందించేందుకు పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో జీసీసీల పాత్ర కీలకమని, వాటిని వ్యూహాత్మక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పలువురు ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More : ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి
