రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రవాసులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ కాలంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి, వారిలో నమ్మకాన్ని పెంపొందించేందుకు లోకేశ్ చేసిన ప్రయత్నం సఫలమైంది.
ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన అప్రతిహత స్పందన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసింది. మొత్తం 35 కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గొన్నారు. వీటిలో పారిశ్రామికవేత్తలతో 19 వన్-టు-వన్ చర్చలు, 6 ప్రభుత్వాల మధ్య సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ చర్చలు, 4 సైట్ విజిట్లు, 2 డయాస్పోరా ఈవెంట్లు ఉన్నాయి.
పర్యటనలో ఎయిర్ బస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, క్యాపిటా ల్యాండ్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు, ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్య విధానాల గురించి లోకేశ్ సమగ్రంగా వివరించారు.
ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో ఎంఓయూపై సంతకం చేసిన తర్వాత అనుమతుల నుంచి కార్యకలాపాలు ప్రారంభించే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని లోకేశ్ ఇచ్చిన భరోసా పరిశ్రమదారుల్లో విశ్వాసం కలిగించింది. అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత జరిగిన ఈ సింగపూర్ టూర్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహానికి దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More : ప్రకాశం బ్యారేజ్ నుంచి 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల

One thought on “సింగపూర్ పర్యటన విజయవంతం – Minister”
Comments are closed.