తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నీటిని సముద్రం పాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసమర్థ కాంగ్రెస్ పాలన
కేటీఆర్ తన ట్వీట్‌లో “చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. నీళ్లు అన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతోంది” అంటూ మండిపడ్డారు.
కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా వాటిని నిలిపే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
నలభై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఫలితంగానే తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాల్లో తగిన వాటా లభించలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు
పదేళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి వందల టీఎంసీల నీటిని ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించిందని గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపుతూ మరమ్మతులు చేపట్టకుండా నీటిని కిందకు వదిలి ఇసుక వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరు ప్రాజెక్టు పనులు నిలిపివేతపై ఆగ్రహం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నీళ్లు ఎత్తిపోసేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా.. టెండర్లు రద్దు చేసి 15 నెలలుగా పనులను పడావు పెట్టారని ఆరోపించారు.
రైతుల పొలాలను ఎండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు.

One thought on “కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు”
Comments are closed.