మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాము చేనేత కార్మికులకు స్వంత నిధులతో సహాయం చేశామని గుర్తుచేశారు. “యువగళం పాదయాత్రలో సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చాం. ఇప్పుడు వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాం” అని చెప్పారు.
చేనేతల ఆదాయం 30 శాతం పెరగడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ చేపట్టామన్నారు. చేనేతలతో పాటు స్వర్ణకారులను కూడా ప్రభుత్వం ఆదరిస్తోందని వెల్లడించారు. “మా దగ్గరకు వచ్చే ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది” అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కారు కొనసాగుతుంటే, మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు.
చేనేత రంగానికి తన జీవితాన్ని అర్పించిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read More : చేనేత కార్మికులకు అండగా ఏపీ ప్రభుత్వం
