12 ఏళ్ల బాలికపై పాఠశాలలోనే గ్యాంగ్‌రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మురాదాబాద్‌ జిల్లాలో తలదించుకునే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో, ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే 12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. మే 8వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితులు శీతల పానీయంలో మత్తు మందు కలిపి బాలికను అపహరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు సమాచారం.

ఘటన వివరాలు ఇలా…

ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైన అనంతరం పోలీసులు ఐదుగురు విద్యార్థులను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుల వయసు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండగా, వారంతా స్థానికంగా చదువుతున్న స్కూల్ విద్యార్థులే. బాధిత బాలిక మాత్రం వేరే పాఠశాలలో చదువుతోంది. నిందితుల్లో ఒకరికి తండ్రి అదే పాఠశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాల తాళాలను తండ్రి ఇంటి నుండి తీసుకువచ్చిన బాలుడు, ప్రధాన గేటుకు తాళం వేసి బాలికను పాఠశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు.

భయంతో నోరు మెదపని బాలిక

బాధిత బాలిక మత్తు మందుతో స్పృహతప్పిన తర్వాతే లైంగికదాడి జరగిందని సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించడంతో బాలిక తీవ్ర భయాందోళనలో ఉండిపోయింది. అయితే, ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఆరా తీసినప్పటికీ బాలిక విషయాన్ని చెప్పలేదు. కానీ సోమవారం రాత్రి ఓ పొరుగింటి వ్యక్తి మొబైల్‌లో ఉన్న వీడియోను చూపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు స్పందన

ఈ ఘటనపై స్పందించిన మురాదాబాద్ ఎస్పీ సత్పాల్ అంటిల్ మాట్లాడుతూ, ‘‘ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించాం. వీరంతా మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరుస్తాం. బాధిత బాలికకు కౌన్సెలింగ్ అందిస్తున్నాం. కేసును వేగంగా విచారించి, త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం,’’ అని తెలిపారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల భద్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read More : భద్రతా బలగాలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి

One thought on “12 ఏళ్ల బాలికపై పాఠశాలలోనే గ్యాంగ్‌రేప్

Comments are closed.