ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుదాడులలో కొత్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజాపూర్ జిల్లా పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
కాగా, నిన్న నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు (అలియాస్ బసవరాజు) సహా కీలక నేతలు మృతిచెందినట్లు గుర్తించారు. అలాగే బాపట్ల జిల్లాకు చెందిన మరో ప్రధాన నేత సజ్జ నాగేశ్వరరావు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలియజేశారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం అనంతరం అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ ఘటనా సమయంలో గాయపడిన రమేష్ అనే జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, మొత్తం ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అబూజ్‌మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. గాయపడి తప్పించిన మావోయిస్టులను పట్టుకోవడానికి విస్తృత గాలింపు చర్యలు తీసుకుంటున్నాయి. అటవీ ప్రాంతం దట్టమైనది మరియు భారీ వర్షాలు పడుతున్న కారణంగా మృతదేహాలను తరలించడం ఆలస్యం అవుతోందని పోలీసులు తెలిపారు. కొన్ని మృతదేహాలను నారాయణ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గుర్తింపు ప్రక్రియ పూర్తైన తర్వాతే కుటుంబాలకు అప్పగిస్తారు.
కర్రె గుట్టలో సుమారు 24 రోజుల క్రితం జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించినప్పటికీ, అగ్రనేతలు తప్పించుకున్నారు. దీంతో అబూజ్‌మాడ్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా భావించిన మావోయిస్టులు, కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు సమితి కూర్చుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు మూడు రోజుల పాటు వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడులు జరిపి విజయాన్ని సాధించాయని తెలుస్తోంది. మావోయిస్టులకు మూడు నుండి నాలుగు అంచెల భద్రత ఉన్నప్పటికీ, భద్రతా బలగాలు వారిని ఛేదించడంలో విజయం సాధించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి ఈ విజయానికి సంబంధించి భద్రతా బలగాలను అభినందించారు. ప్రస్తుతం అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Read More : అరుణాచల్ ప్రదేశ్‌లో హైటెక్ కాపీయింగ్ ముఠా హల్చల్…

One thought on “భద్రతా బలగాలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి”
Comments are closed.