మోదీ సరికొత్త రికార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానిగా, ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఇవాళ్టితో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 4,078 రోజులు పూర్తిచేశారు. దీంతో దేశ చరిత్రలో ఏకబిగిన ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన రెండో వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు దివంగత ఇందిరాగాంధీ పేరిట ఉండేది. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు ప్రధానిగా పనిచేశారు.దేశపు తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మాత్రమే ఈ రికార్డును అధిగమించారు. నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వరుసగా 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని విజయపథంలో నడిపించారు. దీంతో వరుసగా మూడు సార్లు తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనతను నెహ్రూ తర్వాత మోదీ సాధించారు.

అలాగే స్వాతంత్య్రం తర్వాత జన్మించిన వారిలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన కాంగ్రెసేతర నాయకుడిగా కూడా మోదీ నిలిచారు. లోక్‌సభలో రెండు సార్లు పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ (1971) తర్వాత అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధానిగా గుర్తింపు పొందారు.

అటు సీఎంగా, ఇటు ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన అరుదైన రికార్డును కూడా మోదీ ఖాతాలో వేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ, 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ కాలంలో 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని గెలిపించారు. అనంతరం 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు.

దీంతో దేశంలో సీఎంగా, ప్రధానమంత్రిగా వరుసగా ఆరు ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించిన ఏకైక నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.

Read More : బీసీ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా బీజేపీ – పీసీసీ చీఫ్