జాతీయ విద్యా విధానం (NEP) అమలు చేయకపోవడాన్ని కారణంగా చూపుతూ తమకు రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేశారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి మంజూరైన సమగ్ర శిక్ష పథకం కింద విడుదల చేయాల్సిన నిధులను జాప్యం చేస్తున్నదని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.
త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు
జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు ఇంగ్లిష్, తమ ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషగా హిందీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, తమిళనాడు ప్రభుత్వం దక్షిణ రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నంగా దీన్ని భావిస్తోంది. అందువల్ల తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామంటోంది.
కేంద్రం సహకరించడంలేదన్న ఆరోపణ
తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్న వివరాల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో సమగ్ర శిక్ష పథకానికి సంబంధించి రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉందని కేంద్రం అంగీకరించిందని పేర్కొంది. మొత్తం రూ.3,585.99 కోట్ల నిధులు మంజూరు కాగా, అందులో కేంద్ర వాటా రూ.2,151 కోట్లు ఏప్రిల్ 1, 2023 నుంచే చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒక్క వాయిదా కూడా విడుదల కాలేదని పేర్కొంది.
నిధుల నిలిపివేతపై డీఎంకే విమర్శలు
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని తమపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఈ నిధుల విడుదలను కట్టివేసిందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. “జాతీయ విద్యా విధానం (NEP) మరియు పీఎం శ్రీ పాఠశాలల పథకాలను అమలు చేయకపోవడాన్ని సమగ్ర శిక్ష నిధులకు సంబంధం పెట్టడం సరికాదు. ఇవి వేర్వేరు పథకాలు” అని తమ పిటిషన్లో పేర్కొంది.
సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
నిధుల విడుదలను ఈ విధంగా నిలిపివేయడం రాష్ట్ర అధికార పరిధిలో ఉన్న విద్యా విధానంపై జోక్యం చేసుకున్నట్లే అని తమిళనాడు వాదిస్తోంది. ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లోని సహకార సమాఖ్య స్ఫూర్తిని గణనీయంగా దెబ్బతీస్తుందని పేర్కొంది.
ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జాతీయ విద్యా విధానంపై కొనసాగుతున్న విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
Read More : రాహుల్ వ్యాఖ్యలపై పాక్ చర్చ..
