ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన అన్ని అనుమతులు మంజూరవుతుండగా, ఎటువంటి అవరోధాలు లేకుండానే పనుల్లో జాప్యం జరగడం బాధాకరమన్నారు. ఇకపై గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణాల్లో జాప్యం జరిగితే, సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేలా కేంద్రాన్ని కోరనున్నట్టు హెచ్చరించారు.
ప్రత్యేకంగా బెంగళూరు – కడప – విజయవాడ జాతీయ రహదారిలో భాగమైన కోడూరు క్రాస్ – కడప – ముప్పవరం వరకు ఉన్న ప్యాకేజీలో పనులు నెమ్మదిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ ఆలస్యం కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.
పనుల ఆలస్యానికి కారణాలు ఏమిటో కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులు వంటి సమస్యలను జూలై నెలలోగా పూర్తిగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్ర అభివృద్ధిలో జాతీయ రహదారులు కీలక భాగమై ఉంటాయని, ఇకపై ఎటువంటి నిర్లక్ష్యానికి తావుండదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
Read More : హైదరాబాద్, అన్నమయ్య జిల్లాల్లో ఆత్మహత్యలు
