హనీమూన్ హత్య కేసులో రాజ్ కుష్వాహా అమాయకుడు?

మేఘాలయలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్యకేసు ఇప్పటికీ వివిధ మలుపులతో కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించిన వారిలో ఉన్న రాజ్ కుష్వాహా అమాయకుడని, అతనికి అసలు ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. రాజ్‌ను నిర్ధారించకుండా అరెస్ట్ చేయడం తగదని వారు వాపోయారు.

ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన సంగతి తెలిసిందే. మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా వద్ద ఈ జంట అదృశ్యమవగా, జూన్ 2న రాజా మృతదేహాన్ని లోయలో గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా భార్య సోనమ్‌నే ప్రధాన షరాయితీగా గుర్తించగా, ఆమె సహాయానికి రాజ్ కుష్వాహా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇప్పటికే సోనమ్‌ను ఘాజీపూర్‌లో జూన్ 9న అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాజ్‌ను కూడా హత్య కుట్రలో భాగంగా అరెస్టు చేశారు. అయితే రాజ్ తల్లి మాట్లాడుతూ, “నా కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదు. పోలీసులు అతన్ని నిరాధారంగా అరెస్ట్ చేశారు. అతను అమాయకుడు. ఈ ఆరోపణలన్నీ అబద్ధాలు,” అని కన్నీటి వెంట పగిలిపోయారు.

రాజ్ కుష్వాహా వయసు కేవలం 20 సంవత్సరాలేనని, సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడని వారు తెలిపారు. అతని తండ్రి కోవిడ్ సమయంలో మృతి చెందిన తర్వాత కుటుంబ భారం అతనిపైనే ఉందని, ఇలాంటి చర్యకు అతను పాల్పడే వాడుకాదని కుటుంబ సభ్యులు వివరించారు.

రాజ్ సోదరి మాట్లాడుతూ, “నాకు నా తమ్ముడి పై పూర్తి నమ్మకముంది. అతను అలాంటి దుర్మార్గపు పని చేయడు. ఈ కేసు నుంచి అతనిని విముక్తి చేయాలి. పోలీసులది తప్పు దిశలో దర్యాప్తు,” అని పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో రాజ్ ఇంట్లోనే ఉన్నాడని ఆమె వివరించారు.

పోలీసుల వాదన ప్రకారం రాజ్, సోనమ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులు దీనిని ఖండిస్తూ వృత్తిపరమైన పరిచయం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ హత్య కేసు ఉత్కంఠను రేపుతోందీ, పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

Read More : నంబాల కేశవరావు మృతి నిరసనగా ఎలర్ట్‌లో ఏవోబీ