ఇటీవల సోషల్ మీడియాలో మంచు కుటుంబం మరియు దివంగత నటి సౌందర్యకు సంబంధించిన కుటుంబ వివాదాలపై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో, మోహన్ బాబుపై ఖమ్మంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం, సౌందర్య మరణానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు GS స్పందించారు. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న రఘు, ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఈ ఆరోపణలను ఖండించారు.
తన భార్య సౌందర్యకు మరియు మోహన్ బాబుకు మధ్య ఏ మాత్రం ఆస్తి వివాదం లేదని రఘు స్పష్టం చేశారు.
“ఆస్తికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అసత్యం. శ్రీ మోహన్ బాబు గారు నా భార్య దివంగత శ్రీమతి సౌందర్య నుండి ఏ విధమైన ఆస్తిని అక్రమంగా పొందలేదని స్పష్టంగా చెబుతున్నాను. మా కుటుంబానికి, మోహన్ బాబుగారికి ఎలాంటి భూవివహారాలు లేవు”, అని రఘు తన లేఖలో పేర్కొన్నారు.
రఘు తన లేఖలో 25 ఏళ్లుగా మోహన్ బాబును వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉందని, ఆయన కుటుంబంతో తమకు పరస్పర గౌరవం, మద్దతుతో కూడిన బంధం ఉన్నదని తెలిపారు.
“మేము ఒక కుటుంబం, మోహన్ బాబు గారితో మా సంబంధం ఎంతో బలమైనది. మేము ఎప్పటికీ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాము. ఈ నేపథ్యంలో, మోహన్ బాబుగారితో మా కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని మళ్లీ స్పష్టం చేస్తున్నాను”, అని రఘు పేర్కొన్నారు.
ఈ వివరణతో, సౌందర్య మరణానికి మోహన్ బాబుకు సంబంధం ఉందన్న ఆరోపణలపై క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ, ఈ వివాదంపై మరింత చర్చ కొనసాగుతున్నది.


One thought on “మంచు కుటుంబంపై ఆరోపణలు: సౌందర్య భర్త రఘు వివరణ”
Comments are closed.