వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో జరిగిన మూడేళ్ల చిన్నారి పై అఘాయిత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవత్వం మరిచిపోయిన నరరూప రాక్షసుడు, బంధువుగా చెప్పబడుతున్న వ్యక్తే ఈ హృదయ విదారక ఘాతుకానికి పాల్పడటం బాధాకరమని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇలాంటి పాశవిక ఘటనలు సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్, ‘‘ఇది సామాజికంగా మన వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది. నన్ను ఇది తీవ్రంగా కలచివేసింది. చిన్నారులపై ఈ రకమైన అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం సాగుతాయి?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకముందు జమ్ముకశ్మీర్‌లో ఆసిఫా అనే చిన్నారి కేసును గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అప్పుడూ రోడ్డుపైకి వచ్చి పోరాడానని, కానీ ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనల్లో నిందితులకు శిక్ష తప్పదన్న నమ్మకాన్ని సమాజంలో కలిగించాలన్నారు.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడాలంటేనే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ, హోంశాఖ, డీజీపీతో పాటు సంబంధిత అధికారులను ఆయన కోరారు.
చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కల్యాణ్, ‘‘కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు సమాజం మేల్కొనాలి,’’ అని స్పష్టం చేశారు.
Read More : వైఎస్ షర్మిల పర్యటనతో ఏపీ కాంగ్రెస్‌కి నూతన ఊపుమీదే!

One thought on “మైలవరం చిన్నారి ఘటనపై DCM ఆగ్రహం”
Comments are closed.