మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు ?

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న జనహిత యాత్రలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్ల ఫలితమేనని ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణలోని మిగతా బీజేపీ ఎంపీల గెలుపుపైనా అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీసీల సమస్యలను పక్కనపెట్టి బండి సంజయ్ ఢిల్లీ రాజకీయాల్లో మునిగిపోయారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ సైతం ప్రజల మద్దతుతో కాకుండా దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని మహేశ్ గౌడ్ ఆరోపించారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైందని, త్వరలోనే నాలుగో ముక్క బయటకు వస్తుందని జోస్యం చెప్పారు. ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ తప్ప మరే పార్టీకి భవిష్యత్తు లేదని, రాబోయే ఎన్నికల్లో వందకు తగ్గకుండా సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, వారికి భరోసా కల్పించడానికే జనహిత యాత్ర చేపట్టామని మహేశ్ గౌడ్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయలేకపోయిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో ఇళ్లను సిద్ధం చేసి చూపిస్తోందని అన్నారు. కులం, మతం పేరుతో ఓట్లు అడగటం బీజేపీకి అలవాటు అని, కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

Read More : సీఎం పై హరీష్ రావు తీవ్ర విమర్శలు

One thought on “మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు ?

Comments are closed.