ఇంటింటికీ మద్యం – కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ktr

తెలంగాణలో మద్యం విక్రయాలను పల్లెపల్లెలకు విస్తరించాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం కోసం మద్యం విక్రయాలనే ఆధారంగా చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. “నాడు కేసీఆర్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి చక్రాలు తిరిగాయి. ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని, ఇంటింటికి తాగునీళ్లు అందించాం. ఆడబిడ్డలకు ఉన్న ఇబ్బందులను తగ్గించాం. కానీ ఇప్పుడు ప్రగతిబాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారు” అని కేటీఆర్ ఆరోపించారు.

రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మద్యం ప్రియుల బలహీనతను మార్చుకోవడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏడాది క్రితం సగటున ఒక్క వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897 కాగా, కాంగ్రెస్ పాలనలో అది రూ.1,623కి పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంపు, దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచే నిర్ణయం కూడా తీసుకున్నారని విమర్శించారు. “ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం.. పాలన గాలికి, ప్రగతి కాటికి” అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్‌లో తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేశారు.

Read More : నలుగురితో భర్త హత్యకు యత్నించిన భార్య