కొత్తగూడెం జిల్లాలో భార్య హత్య కేసు.

కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు ఆహారం పెట్టకుండా, అదనపు కట్నం కోసం రెండేళ్లుగా హింసిస్తూ చివరికి ప్రాణాలు తీశాడని ఓ భర్తపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషాదకర సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురానికి చెందిన లక్ష్మీప్రసన్న (33)కు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుతో 2015లో వివాహం జరిగింది. వివాహానంతరం గత మూడేళ్లుగా ఈ దంపతులు అశ్వారావుపేటలో నివసిస్తున్నారు.

శనివారం, తన భార్య మెట్లపై నుంచి జారి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించానని నరేష్ బాబు తన అత్తమామలకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. కొత్త గాయాలతో పాటు పాత గాయాల ఆనవాళ్లు కూడా కనిపించడంతో వారికి అనుమానం బలపడింది.

రెండేళ్లుగా తమ కుమార్తెను ఒక గదిలో బంధించి, కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వకుండా నిర్భందించారని, అదనపు కట్నం కోసం నిరంతరం హింసించారని తల్లిదండ్రులు ఆరోపించారు. చివరికి ఆహారం కూడా ఇవ్వకుండా ప్రాణాలు తీశారని వారు వాదిస్తున్నారు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ లీజు

One thought on “కొత్తగూడెం జిల్లాలో భార్య హత్య కేసు.

Comments are closed.