కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు రంగం సిద్ధం

సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు త్వరలో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు జూన్ 9న ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం జూన్ 10న మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన పోలీసులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన గుంటూరు జిల్లా జైలుకు తరలించబడ్డారు.

ఈ నేపథ్యంలో బెయిల్ కోసం కొమ్మినేని హైకోర్టును ఆశ్రయించగా, విచారణ కొనసాగుతున్నప్పటికీ అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జూన్ 13న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు సెలవుల కారణంగా విడుదల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు శుక్రవారం సాయంత్రం వరకూ చేరకపోవడంతో శని, ఆదివారాల్లో ప్రక్రియ ముందుకు సాగలేదు.

ప్రస్తుతం మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన విడుదల ప్రక్రియ పూర్తికానుంది. నేడు ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Read More : జగన్‌పై మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు