కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు తాము విడుదల చేయలేదని, వాళ్లే విడుదల చేశారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించారని విమర్శించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం తన మానస పుత్రిక అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రీడిజైనింగ్ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. తెలివి గల వ్యక్తులు ఎవరైనా ఈ విధమైన ప్రాజెక్టును చేపట్టేవారా అంటూ ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా కమీషన్ల కోసం ప్రాజెక్టును వేరే చోట ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి, మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం కాళేశ్వరం 8వ వింతగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు ఎన్డీఎస్ఏ నివేదికతో బయటపడ్డాయని విమర్శించారు. త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేటీఆర్‌కు ఎన్డీఎస్ రిపోర్టుపై అవగాహన లేదని, ఆయన మాట్లాడకపోవడం మంచిదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ వద్ద నిర్మాణం విఫలమవుతుందని అప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ అధికారులు హెచ్చరించారని పేర్కొన్నారు.
Read More : రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

One thought on “మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు”
Comments are closed.