కేటీఆర్ ఏసీబీ విచారణపై పొంగులేటి తీవ్ర విమర్శలు

srinivas ponguleti

తెలంగాణలో కొనసాగుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణను కేంద్రంగా చేసుకుని రాజకీయ విమర్శలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చేసిన హడావుడిని ఇప్పుడు కేటీఆర్ పునరావృతం చేస్తున్నారని ఆరోపించారు. “ఏసీబీ విచారణకు వెళ్తూ ఇంత హడావుడి అవసరమా?” అని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఏసీబీ విచారణ అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి కక్ష సాధింపునకు తావులేదని తెలిపారు.

రాబోయే పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. “త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పెంచిన బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ఖాయమని జోస్యం చెప్పారు.

అలాగే, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. “మొదటి విడతలో అందని వారికి కూడా దశలవారీగా ఇళ్లు కట్టిస్తాం” అని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్ల మధ్య కూడా ప్రభుత్వం ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చిందని పేర్కొన్నారు. మిగిలిన హామీలను త్వరలో అమలు చేస్తామని తెలిపారు.

Read More : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల