మాజీ మంత్రి కొడాలి నానికి విశ్రాంతి అవసరం

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆరోగ్య రీత్యా విశ్రాంతి అవసరమని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన చికిత్స అనంతర విశ్రాంతిలో ఉన్నారని, ఈ సమయంలో ఆయనను కలుసుకోవడానికి గుడివాడ నియోజకవర్గం నుంచి గానీ, ఇతర ప్రాంతాల నుంచి గానీ ఎవరూ రావద్దని అభ్యర్థించారు.

ఈ మేరకు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటంతో, డాక్టర్లు కొడాలి నాని ఎక్కువమంది వ్యక్తులను కలవకూడదని సూచించారని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేస్తున్నామని వివరించారు.

కొడాలి నాని ఇటీవల ఓ సన్నిహితుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన పూర్తిగా కోలుకున్నారని అనుమానాలు వస్తున్నాయని శశిభూషణ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కొడాలి నానికి పూర్తి విశ్రాంతి అవసరమని, ఆయనను కలవడానికి వచ్చే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరొకటి రెండు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకి వస్తారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొడాలి నాని హైదరాబాద్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబై వెళ్లారు. అక్కడ శస్త్రచికిత్స జరగగా, అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Read More : థియేటర్ బంద్ వివాదంపై కీలక నిర్ణయం

One thought on “మాజీ మంత్రి కొడాలి నానికి విశ్రాంతి అవసరం

Comments are closed.