బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తెలంగాణ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం మరోసారి బీఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. సిరిసంపదలు సమృద్ధిగా ఉన్న ఈ రాష్ట్రాన్ని కొందరు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
గోదావరి కన్నీటి గోస పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహా పాదయాత్ర శనివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనలేదని, కానీ ప్రస్తుతం తెలంగాణ సమస్యల చుట్టూ చిక్కుకుందని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాటమే శాశ్వతం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తుచేసిన కేసీఆర్, తన మెడపై కత్తి పెట్టినా వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాను తెలంగాణ కోసం పోరాడానని తెలిపారు. భవిష్యత్తులోనూ తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని అన్నారు.
తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్న సూచనలు
కేసీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ తిరిగి బలపడేందుకు కేసీఆర్ వ్యూహాలను అమలు చేయబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం మరింత బలంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read More : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త: రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పు
