తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించేందుకు అసెంబ్లీని తక్షణమే ఆహ్వానించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళల పట్ల చేసిన హామీలను నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెన్షన్ల పెంపు సహా అన్ని హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ నేత సోనియా గాంధీకి పోస్టు కార్డుల ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
గోదావరి జలాల అంశంపై కేసీఆర్‌కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కవిత… “అసెంబ్లీలో చర్చకు సిద్ధం. కానీ ఆరు గ్యారెంటీలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలి” అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ పోరాటం మరచిపోవడం తగదని, కాంగ్రెస్‌కు దమ్మున్నపుడే రాష్ట్రం సాధ్యమైందని అన్నారు.
రేవంత్ చంద్రబాబును బిర్యానీ తినిపించి, గోదావరి నీళ్లు కానుకగా ఇచ్చారన్న ఆరోపణలు చేస్తూ, రేవంత్‌కు అబద్ధాలు చెప్పడం అలవాటైందన్నారు. పోలవరం, బనకచర్ల అంశాలపై ఆయనకు సరైన అవగాహన లేదని విమర్శించారు.
పెన్షన్ హామీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత… వృద్ధులకు రూ.2,000ను రూ.4,000కి, వికలాంగులకు రూ.4,000ను రూ.6,000కి పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం హామీ కూడా విస్మరించారని పేర్కొన్నారు.
“ఇవన్నీ ఎన్నికల ముందు సోనియా గాంధీ పేరుతో హామీ ఇచ్చారు. కానీ నేడు ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తున్నాం” అని కవిత స్పష్టం చేశారు.
Read More : తెలంగాణలో మూడు రోజుల వర్షాల అలెర్ట్

One thought on “BRS MLC : కాంగ్రెస్ హామీలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?”
Comments are closed.