కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తానున్న విభేదాలను ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ బహిరంగంగా బయటపెట్టారు. ముఖ్యంగా సీఎం పదవిపై చేసిన సంచలన వ్యాఖ్యలు, అధికార భాగస్వామ్యం అంశంపై పరోక్షంగా సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘రాజ్యాంగ సవాళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాను చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, పార్టీకి చేసిన సేవలను వివరించారు. అదే సమయంలో గాంధీ కుటుంబాన్ని ప్రశంసిస్తూ, అధికార భాగస్వామ్యం గురించి పరోక్షంగా కీలక సందేశం ఇచ్చారు.
“2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యజించి, సిక్కు, అల్పసంఖ్యాకుడైన మన్మోహన్ సింగ్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఇది ప్రజాస్వామ్యంలో అతి పెద్ద త్యాగం. ఈ రోజుల్లో అయితే ఒక చిన్న పంచాయతీ పదవిని కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు” అని శివకుమార్ వ్యాఖ్యానించారు.
శివకుమార్ ఎవరిపేరూ నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు సిద్ధరామయ్యకే ఉద్దేశించాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అధికార భాగస్వామ్య ఒప్పందం లేదని, ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
Read More : రాజేంద్ర చోళ స్మారక నాణెం విడుదల

One thought on “కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ రగులుకున్నాయి !”
Comments are closed.