కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ములబాగిల్ పట్టణంలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో పదివేల రూపాయల పందెం కాసి ఐదు బాటిళ్లు మద్యం నీరు కలపకుండా తాగిన ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే, ములబాగిల్‌కు చెందిన కార్తీక్ (21) అనే యువకుడు తన స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణితో మద్యం తాగే విషయమై చర్చించాడు. “ఐదు సీసాల మద్యం నీరు కలపకుండా తాగగలనని” చెప్పిన కార్తీక్‌కు వెంకటరెడ్డి రూ.10 వేల పందెం వేశాడు. పందెం కుదరడంతో కార్తీక్ బాటిళ్లను ఒకటిపిన్నగా తాగేశాడు.
అయితే కొద్దిసేపటికే అతడి ఆరోగ్యం బాగా క్షీణించడంతో స్నేహితులు ములబాగిల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ మరణించాడు. బాధాకరమైన విషయం ఏమంటే, కార్తీక్‌కు ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది. వారం రోజుల క్రితమే ఆయన భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కుటుంబంలో కొత్త జీవితం ప్రారంభమైన వేళ ఈ విషాదం అందరినీ కలిచివేసింది.
Read More : 14 ఏళ్ల బాలిక మృతి
