కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు ఫుల్‌స్టాప్

కర్ణాటక రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన ముఖ్యమంత్రి పదవిలో మార్పు అంశానికి సీఎం సిద్ధరామయ్య తుదిపుల్‌స్టాప్ పెట్టారు. ఐదేళ్ల కాలపరిమితి వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తద్వారా నేతల వ్యాఖ్యలతో ఊపందుకున్న ప్రచారానికి ముగింపు పలికారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, “ఇంకా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే కొనసాగుతాను. ఈ విషయంలో ఏవైనా అనుమానాలున్నాయా?” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మారుస్తారన్న ప్రచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “బీజేపీ, జేడీఎస్ నేతలు మా పార్టీ విషయాల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్లు కాంగ్రెస్ అధిష్ఠానమా?” అంటూ సూటిగా ప్రశ్నించారు.

డీకే శివకుమార్ స్పందన
ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ, సిద్ధరామయ్యకు పూర్తి మద్దతుగా ఉన్నానని చెప్పారు. “పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అదే చేయడమే నా ధర్మం. సిద్ధరామయ్యకు అండగా నిలవడం తప్ప నాకు ఇంకే దారి లేదు,” అని స్పష్టంచేశారు.

ఊహాగానాలకు కారణం
ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలే సీఎం మార్పు చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్, “ఇంకా రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు” అని అన్నారు. మంత్రి కే.ఎన్. రాజన్న కూడా సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయని వ్యాఖ్యానించడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

అయితే తాజాగా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇచ్చిన స్పష్టతలతో ఈ అంశంపై ప్రచారాలకు తెరపడినట్లయ్యింది.

Read More : పాశమైలారం పేలుడు ఘటనపై సిగాచీ ప్రకటన

One thought on “కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు ఫుల్‌స్టాప్

Comments are closed.