మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన జూన్ 22న వసతి గృహంలో జరిగింది.

జూనియర్ విద్యార్థిని తనను తీవ్రంగా వేధించారంటూ అదే రోజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన ఎయిమ్స్ యాజమాన్యం, మొత్తం 15 మందిని బాధ్యులుగా గుర్తించింది. అనంతరం జరిగిన సమగ్ర దర్యాప్తులో డీన్ కుమారుడు సహా 13 మంది సీనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు సంబంధించి సాక్ష్యాధారాలు లభించాయి.

ఈ మేరకు ఎయిమ్స్ యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది.

  • ముగ్గురు సీనియర్లను ఏడాదిన్నర పాటు సస్పెండ్ చేసి, ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధించింది.
  • మరో ఆరుగురిని ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ అదే విధంగా జరిమానా విధించింది.
  • మిగిలిన నలుగురిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ రూ.25 వేలు జరిమానా విధించింది.

ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల ఎలాంటి కనికరం చూపేది లేదని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఎయిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Read More : తిరుమల హోటళ్ల ధరలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు