కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొల్లూరులో షూటింగ్ ముగిశాక, జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ స్నానం కోసం సౌపర్ణిక నదికి వెళ్లాడు. అయితే నీటి లోతు అంచనా వేయలేకపోయిన అతను దురదృష్టవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇది ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రబృందానికి ఎదురైన మొదటి ప్రమాదం కాదు. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడగా, పలువురికి గాయాలయ్యాయి. అంతేకాకుండా గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసమైంది. తాజా ఘటనతో సినిమా బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
‘హోంబాలే ఫిల్మ్స్’ నిర్మిస్తున్న ఈ మూవీకి దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. గతంలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ దశలోనే వరుస అపశ్రుతులు చిత్ర బృందాన్ని కలవరపెడుతున్నాయి.
జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణంపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ ప్రమాదం సినిమాపై ఉన్న క్రేజ్‌ను కాస్త ఆందోళనగా మార్చింది. శ్రద్ధాంజలులు వెల్లువెత్తుతుండగా, బృందం నుండి స్పందన ఎప్పుడొస్తుందో చూడాలి.

One thought on “కాంతార 2 షూటింగ్లో విషాదం: జూనియర్ ఆర్టిస్ట్ మృతి”
Comments are closed.