కాళేశ్వరంపై రూ. లక్షల కోట్లను ఖర్చు చేసినా, మేడిగడ్డ కూలిపోయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జలసౌధలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం వల్ల నీటి సరఫరా కాకపోయినా, కొందరి జేబులు మాత్రం నిండిపోయాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు కింద ఇప్పటికీ ఒక్క ఎకరం కూడా ఆయకట్టు చేరలేదని ఆయన మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో పూర్తిగా వైఫల్యానికి గురయ్యారని ఆరోపించారు.
“కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకూడదని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించాం. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉండి టెలిమెట్రిక్ వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే, కృష్ణా జలాలపై సరైన కేటాయింపులు సాధించలేకపోయారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా విస్మరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిపేర్ల బాధ్యతను మేమే తీసుకున్నాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కాళేశ్వరం కూలిపోయిన వెంటనే ఎన్డీఎస్ఏ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టిందని, ప్రాథమిక దర్యాప్తులోనే ప్రాజెక్టు డిజైన్‌లో తప్పిదాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిందని ఆయన తెలిపారు. నీటి నిల్వలు నింపకుండా ఉండాలని ఎన్డీఎస్ఏ లిఖితపూర్వకంగా సూచించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల కోసం అధిక వడ్డీతో రుణాలు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, వాటిని 12 శాతం వడ్డీతో తీసుకుని భారీగా లాభం పొందిందని ఆరోపించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ రుణాలను సమర్థంగా నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించిందని వివరించారు.

One thought on “కాళేశ్వరం వైఫల్యం: మేడిగడ్డ కూలింది, బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు”
Comments are closed.