కడపలో భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.

కడప జిల్లాలోని సీకే దిన్నె మండలంలోని వివాదాస్పద భూములపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబానికి చెందిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్న 63.72 ఎకరాల భూమిపై యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే…
గత నెల 21న కడప కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ద్వారా సీకే దిన్నెలో 63.72 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ భూములు తమ అధీనంలో ఉన్నాయని, మొత్తం 201.17 ఎకరాలపై ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంటూ సజ్జల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సింగిల్ జడ్జి, కలెక్టర్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించారు.

అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, స్వాధీనం చేసుకున్న భూములు అటవీ, నీటిపారుదల, అసైన్‌మెంట్ కేటగిరీలకు చెందినవిగా అధికారులు గుర్తించారని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యులు ఆ భూమి దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు, కానీ ఈ విషయంలో వారు సరైన ఆధారాలను సమర్పించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అధికారులు పంచనామా నిర్వహించారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం, స్టేటస్ కో కొనసాగించాలని స్పష్టం చేసింది.

కేసు తదుపరి విచారణ జూన్ 30న జరగనుండగా, అధికారులు అప్పటికి ముందు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

Read More : టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా: సీబీఐ సంచలన ఆరోపణలు.

One thought on “కడపలో భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.

Comments are closed.