జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం సుందర్‌బనీ సెక్టార్‌లోని పాల్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారని, దానికి ఎదురుగానే భద్రతా దళాలు కూడా తక్షణ చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.
భద్రతా బలగాల సమాచారం మేరకు, జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడే మార్గాల్లోని ఒకటి ఈ ప్రాంతమే. దీంతో ఆర్మీ అప్రమత్తమై ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తూ, ఉగ్రవాదులను అణిచివేసే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఉగ్రవాదుల కాల్పుల కారణంగా పది మంది యాత్రికుల మృతి
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రియాసీ జిల్లాలోని శివ ఖోడీ ఆలయ దర్శనానికి వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. తెర్యాత్ గామ్రం వద్ద వారు కాల్పులు ప్రారంభించడంతో డ్రైవర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బస్సును వేగంగా నడిపాడు. అయితే, అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 33 మంది గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ పరిస్థితులు – ప్రజల ఆందోళన
ఆర్టికల్ 370 రద్దు అనంతరం గత ఏడాది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించగా, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటైనా, ఉగ్రవాద చర్యలు కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు.
ఉగ్రదాడులు నిలువరించేందుకు ముమ్మర భద్రతా చర్యలు
ఉగ్రవాదుల పెచ్చరిల్లుతున్న దాడులను అరికట్టేందుకు భద్రతా బలగాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచి, అనుమానిత వ్యక్తుల కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి. అయినప్పటికీ, తరచుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

2 thoughts on “ఆర్మీకి ఎదురైన కాల్పుల బెడద”
Comments are closed.