సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు అస్వస్థత

ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం గవాయ్ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో విధులకు హాజరవుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

జూలై 12న హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్’ అనే అంశంపై జస్టిస్ గవాయ్ ప్రసంగం చేశారు. బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ -రాజ్యాంగ సభ- భారత రాజ్యాంగం’ పేరిట పోస్టల్ కవర్ ను విడుదల చేశారు.