జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం ఉదయం శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
వైద్య-చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తరువాత, మృతుల భౌతికకాయాలను పీసీఆర్‌కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి, మృతుల ఆత్మశాంతికి ప్రార్థించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
శ్రీనగర్ పీసీఆర్‌లో నివాళులు అర్పించిన వెంటనే, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి పహల్గామ్ బైసరన్ ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ దారుణ ఘటన నేపథ్యంలో, కశ్మీర్ లోయ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ కశ్మీర్‌లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా, ఏరియల్ సర్వైలెన్స్, డ్రోన్ల పర్యవేక్షణతో పాటు భారీ భద్రతా బలగాలను మోహరించారు.
ఈ దాడికి నిరసనగా, కశ్మీర్ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. శ్రీనగర్‌తో సహా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో దుకాణాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీనగర్ వాణిజ్య కేంద్రమైన లాల్ చౌక్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది, నిశ్శబ్దం ఆవరించింది.
Read More : ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేశారు.
