వైఎస్ జగన్ చేపడుతున్న పర్యటనలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ పర్యటనలు ప్రజా సమస్యల పరిష్కారానికి కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యతిరేకంగా ముందస్తు యోజనతోనే చేస్తున్నారని ఆరోపించారు. జగన్ యాత్రలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని ఎద్దేవా చేసిన అచ్చెన్నాయుడు, పరామర్శకు వెళ్లే నాయకుడు రైతులను నేరుగా కలవాలి కానీ, జిల్లాల నిండా జనాన్ని తరలించి, మామిడి పండ్లను రోడ్లపై పాతివేయడం క్రిమినల్ మైండ్‌కు నిదర్శనమన్నారు. ఇటువంటి చర్యలు సమాజానికి చెడు సందేశం ఇస్తాయని విమర్శించారు. తోతాపురి మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. ఈ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల బంపర్ ఫలద్రూపం వచ్చిందని, గత ఏడాది పరిశ్రమల వద్ద నిల్వల కారణంగా ధరలు పడిపోవడం సహజమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలతో చర్చించి కిలో మామిడిని రూ.8కి కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం అదనంగా రూ.4 మద్దతు అందిస్తోందని వివరించారు.
ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తున్న తరుణంలోనూ జగన్ పర్యటనలు కొనసాగించడాన్ని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన పర్యటనల వెనుక ఉన్న ఉద్దేశం పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాలన్నదేనని మండిపడ్డారు.
Read More : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
