పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం శివాపురం వద్ద మంగళవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకై వెళ్తున్న కూలీలను తరలిస్తున్న బొప్పాయితో లోడ్ చేసిన మినీ ట్రాలీని ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కూలీ పనులతో జీవనోపాధి సాగిస్తున్న ఈ కుటుంబాలపై విషాదం ముసురుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రమాదం అనంతరం పరారైయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, లారీని స్వాధీనం చేసుకుని, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లారీ వేగమే ప్రమాదానికి కారణమైందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. వాహనాల ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ వంటి అంశాలపై కూడా విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మంత్రి లోకేష్ స్పందన
రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read More : మోదీ ప్రసంగం దేశానికి కొత్త దిశ చూపింది
