వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు . బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, ప్రభుత్వ పాలన మోసాల మయం అయిందని జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికలను ఉదహరిస్తూ అభివృద్ధి లేకపోవడం, సంక్షేమం లుప్తమవడం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. పెట్టుబడులు తగ్గాయని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, ఆదాయం తగ్గి అవినీతిపరుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు.
అప్పుల పాలన… మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు
జగన్ చంద్రబాబును “అప్పుల సమ్రాట్”గా అభివర్ణించారు. కేవలం 12 నెలల్లోనే రూ. 1.37 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఇది గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేసిన మొత్తం అప్పుతో పోల్చితే భారీ సంఖ్య అని వివరించారు. రాష్ట్ర ఆదాయం పెరిగినా, రెవెన్యూలో వృద్ధి లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు టీడీపీ మద్దతుదారుల మాఫియాలా మారాయని విమర్శించారు. ఈనాడు ప్రచురించిన కథనాలను తప్పుడు ప్రచారంగా అభివర్ణించి, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక లిక్కర్, ఇసుక, మైనింగ్ రంగాల్లో మాఫియాలు బలంగా ఏర్పడ్డాయని, విద్యుత్ కొనుగోళ్లలోనూ భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. అమరావతిలో భూముల కుంభకోణంతో పాటు, ఉర్సా సంస్థకు బిడ్డింగ్ లేకుండా వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడం తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కేవలం రాజకీయ పోరాటం కాదు, ఎల్లో మీడియా మాయాజాలాన్ని ఎదుర్కొనే యుద్ధం కూడా చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
Read More : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ “మన ఊరు – మాటా మంతి”
