పార్లమెంట్ ప్రాంగణంలో ఇకపై అరకు కాఫీ అందుబాటులోకి వచ్చింది. సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి ఎంపీలు పాల్గొన్నారు.
అరకు కాఫీకి జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి మేరకు పార్లమెంట్ ఆవరణలో రెండు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేశారు. సంగం-1, 2 కోర్ట్ యార్డ్‌లలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లు ఇవాళ్టి నుంచి ఎంపీలకు కాఫీ అందించనున్నాయి.
కాఫీ స్టాళ్లు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రెండు రోజుల ముందే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా పార్లమెంట్‌కు వచ్చి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అరకు కాఫీ అందజేశారు. అరకు గిరిజన రైతుల కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అరకు కాఫీ – గిరిజనుల ఆర్థికాభివృద్ధికి గొప్ప అవకాశం
అరకు ప్రాంత గిరిజన రైతులు ఉత్పత్తి చేసే ఈ ప్రత్యేక కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తృత గిరాకీ ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయడం గిరిజన కాఫీ బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెచ్చే అవకాశం అని అధికారులు పేర్కొన్నారు.
వీడియో చూడండి:
(పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం)
