ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. నిన్న రాత్రి జరిగిన దాడుల్లో తమ దేశం హైపర్‌సోనిక్ క్షిపణులు ప్రయోగించిందని అధికారికంగా ప్రకటించింది. శత్రువుపై ఇకపై జాలి, దయను చూపబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపిన ప్రకారం, “ఆపరేషన్ ఆనెస్ట్ ప్రామిస్ 3″లో భాగంగా జరిగిన 11వ దశ దాడుల్లో హైపర్‌సోనిక్ క్షిపణి ‘ఫత్తా-1’ను ప్రయోగించామని పేర్కొన్నారు. ఆక్రమిత భూభాగాల గగనతలంపై ఇరాన్ దళాలు పూర్తిగా నియంత్రణ సాధించాయని వారు చెప్పారు. ఇదే మొదటిసారి ఈ తరహా శక్తివంతమైన క్షిపణిని ఇరాన్ సైన్యం యుద్ధంలో ఉపయోగించింది.
ఫత్తా-1 క్షిపణి ప్రత్యేకతలు:
2023లో అభివృద్ధి చేసిన ఈ హైపర్‌సోనిక్ క్షిపణికి ‘ఫత్తా-1’ అనే పేరు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్వయంగా ఉంచారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, యారో వంటి ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థల్ని సైతం ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందని ఇరాన్ చెబుతోంది. దీన్ని ‘ఇజ్రాయెల్ స్ట్రైకర్’గా అభివర్ణిస్తున్నారు.
ఫత్తా-1 క్షిపణి పొడవు 12 మీటర్లు, పరిధి 1,400 కిలోమీటర్లు. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తూ, 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
ఈ క్షిపణి ప్రధానంగా హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు మార్గాన్ని మలచుకునే సామర్థ్యం ఉండటం వల్ల శత్రు రాడార్‌లకు చిక్కకుండా గమ్యస్థానాన్ని ఛేదించగలదు. ఇది గంటకు 17,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. శబ్ద వేగం కన్నా ఐదు రెట్లు వేగంగా దూసుకుపోయే ఈ క్షిపణిని గుర్తించి ఆపడం చాలా క్లిష్టమని రక్షణ నిపుణులు అంటున్నారు.
Read More : శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా

One thought on “ఇజ్రాయెల్‌పై ఫత్తా-1 హైపర్‌సోనిక్ క్షిపణులతో ఇరాన్ ప్రతీకారం.”
Comments are closed.