ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ ఘర్షణలో మొత్తం 585 మంది ప్రాణాలు కోల్పోయారు, 1,326 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో మృతులలో 239 మంది సాధారణ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. 2022లో మహ్సా అమిని ఘటన సమయంలో కూడా ఈ సంస్థ ముఖ్యమైన గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తమకు ఉన్న సమాచార వనరుల ద్వారా ఈ వివరాలను ధృవీకరించినట్లు తెలిపింది.
ఇక ఇదే విషయంలో ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన గణాంకాల ప్రకారం 224 మంది మృతిచెందగా, 1,277 మంది గాయపడ్డారు. అయితే ప్రభుత్వం తక్కువ సంఖ్యలోనే మృతుల వివరాలను ప్రకటిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్ అణు ఆయుధ తయారీని నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తాజా పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం. 60 రోజుల గడువు తర్వాతే ఈ చర్యలు చేపట్టామని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ పై బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని, కానీ ప్రస్తుతానికి ఆయనను చంపే ఆలోచన లేదని పేర్కొన్నారు. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
ఇక ఇరాన్ ఈ దాడులపై తీవ్రంగా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి. “ఇదంతా కేవలం హెచ్చరిక మాత్రమే. అసలైన ప్రతీకార చర్య త్వరలో ఉంటుంది” అని ఇరాన్ సైన్యాధిపతి జనరల్ మౌసవి హెచ్చరించారు.
ప్రస్తుత పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతాన్ని మరోసారి అశాంతికి దారి తీసేలా ఉన్నాయి.
Read More : శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా
