అరేబియా సముద్రంలో భారత నౌకాదళం ప్రతీకార దాడులు…

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు గట్టిగా స్పందిస్తూ భారత నౌకాదళం అరేబియా సముద్రంలో కీలక ప్రతీకార చర్యలకు దిగింది. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌కు చెందిన పలు లక్ష్యాలపై ఈ దాడులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించిందన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

గురువారం జమ్మూ నగరంతో పాటు ఆర్‌ఎస్ పురా, ఆర్నియా, సాంబా, హీరానగర్ ప్రాంతాల్లో పాక్ క్షిపణులు ప్రయోగించింది. అయితే భారత వాయుసేన ప్రతిస్పందనలో కీలకపాత్ర పోషించి ఈ ముప్పులను సమర్థవంతంగా అడ్డుకుంది. పఠాన్‌కోట్‌లో షెల్లింగ్, జైసల్మేర్‌లో డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా చండీగఢ్, మొహాలీ, శ్రీనగర్ తదితర నగరాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది.

పాకిస్థాన్ లక్ష్యం జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ వంటి ప్రాంతాల్లోని సైనిక స్థావరాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. SOPల ప్రకారం కైనెటిక్ మరియు నాన్-కైనెటిక్ పద్ధతులతో తక్షణమే ముప్పులను నిర్వీర్యం చేశామని తెలిపింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేసింది.

“దేశ భద్రతే ప్రథమ లక్ష్యం. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, తన ప్రజల రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Read More : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రం…

One thought on “అరేబియా సముద్రంలో భారత నౌకాదళం ప్రతీకార దాడులు…

Comments are closed.