భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం

భారత అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత భారత వాయుసేన అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి ఈరోజు (జూన్ 25) మధ్యాహ్నం 12:01 గంటలకు ఆయన ప్రయాణం ప్రారంభం కానుంది.

శుభాన్షు శుక్లాతో పాటు హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనున్నారు. పెగ్గీ విట్సన్ కమాండర్‌గా, మిగతా ముగ్గురు మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరించనున్నారు. స్పేస్‌ఎక్స్ రూపొందించిన ఫాల్కన్-9 రాకెట్‌, క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు.

60 శాస్త్రీయ ప్రయోగాలు – 7 భారతీయ పరిశోధనలే

ఈ యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా 14 రోజుల పాటు నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఇందులో ఏడు ప్రయోగాలు భారత పరిశోధకులు ప్రతిపాదించినవిగా గుర్తించారు. అంతరిక్షంలో మానవ ఆరోగ్యం, మైక్రోగ్రావిటీ ప్రభావం తదితర అంశాలపై ఇవి దృష్టి పెడతాయి.

వాయిదాలు.. అట్టడుగు నుంచి అగ్రగామి వరకు

ఈ ప్రయోగం అనేకసార్లు వాయిదా పడింది. వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్ల కారణంగా ఆరు సార్లు వాయిదా పడిన తరువాతే నేడు ప్రయోగానికి అనుకూల సమయం దొరికింది. ఈ లాంచ్ ప్యాడ్ నుంచే 1969లో అపోలో-11 ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్లడం విశేషం.

“భారత ప్రజల ఆశలతో నిండిన ఈ యాత్ర” – శుభాన్షు శుక్లా

ప్రయాణానికి ముందు మీడియాతో మాట్లాడిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, “నేను కేవలం పరికరాలు మాత్రమే కాదు, వంద కోట్ల మంది భారతీయుల ఆశలు, కలలను కూడా అంతరిక్షంలోకి మోసుకెళ్తున్నాను,” అని ఉద్దేశపూర్వకంగా చెప్పారు.

1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ సోవియట్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన అనంతరం, శుభాన్షు శుక్లా రెండో భారతీయుడిగా అంతరిక్షయాత్ర చేయనున్నారు. ఈ ఘట్టం ద్వారా భారత అంతరిక్ష దిశలో మరో భారీ అడుగు వేస్తోంది.

Read More : అహ్మదాబాద్ ఘటనపై ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు

One thought on “భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం

Comments are closed.